మదనపల్లి : ఆసియాలోనే అతి పెద్ద టమోటా మార్కెట్ అయిన మదనపల్లిలో టమోటా రైతుల దుస్థితి దయనీయంగా ఉందని, ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, మార్కెట్ యార్డులో రైతులను మోసం చేస్తున్న జాక్ పాట్, అధిక కమీషన్ పైన ఎమ్మెల్యే షాజహాన్ బాషా జోక్యం చేసుకుని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని టిడిపి రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం నిమ్మనపల్లి సర్కిల్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టమోటా రైతుల దుస్దితిపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్‌జే వెంకటేష్ మాట్లాడుతూ టమోటా పంట సాగుకు మదనపల్లి, పుంగనూరు, పలమనేరు, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాలు అనుకూలం అన్నారు. గతంలో రైతులు మాత్రమే టమోటా సాగు చేస్తుండగా ప్రస్తుతం వ్యాపారులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీయార్లు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారని వివరించారు. గతంలో కంటే సాగు విస్తీర్ణం మూడు, నాలుగు రెట్లు పెరిగి ఉత్పత్తి అధికమై ధరలు తగ్గిపోవడం జరిగిందన్నారు. మంగళవారం మదనపల్లి టమోటా మార్కెట్లో 30 కేజీల టమోటా బాక్స్ కేవలం వంద రూపాయలు మాత్రమే పలికిందని వివరించారు. 118 బాక్సుల టమోటాలకు జాక్ పాట్ పోను 99 బాక్సులకు ధర కట్టడం, ఇందులో 10 శాతం కమీషన్, కూలీలు, క్రేట్లు ఇలా రైతులు దోపిడీకి గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళారి వ్వవస్థ కారణంగా రైతాంగం పూర్తి స్థాయిలో నష్టపోతున్నారని, స్దానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా జోక్యం చేసుకుని జాక్ పాట్, 10 శాతం కమీషన్ తొలగించాలని విజ్ఞప్తి చేశారు. టమోటా మార్కెట్ యార్డులో కొంత మంది వ్యాపారులు రైతులను నిలువునా మోసం చేస్తున్నారని ఆరోపించారు. మార్కెట్ 10 శాతం కమీషన్ రద్దు చేసి 4 శాతం మాత్రమే తీసుకోవాలన్నారు. టమోటా ధరలు పూర్తిగా పడిపోయిన పరిస్థితిలో ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతుల నుండి కొనుగోలు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. టమోటా మార్కెట్ పాలక వర్గం లేకపోవడం కూడా రైతుల ఇబ్బందులకు దారి తీస్తోందని అన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతు పక్షాన నిలబడే వ్వక్తికి, రైతుకు పాలక మండలి చైర్మన్ గా నియమించాలని కోరారు.
