




20న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
మదనపల్లి :
ఈ నెల 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఐటియుసి డివిజన్ కన్వినర్ జి. కృష్ణ మూర్తి పిలుపు
నిచ్చారు. మంగళవారం సమ్మె జయప్రదం చెయ్యాలని కోరుతూ ఐ టి యు సి ఆధ్వర్యంలో స్థానిక సర్వ జన ప్రభుత్వ బోధన ఆసుపత్రి నందు సన్నాహక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా జి. కృష్ణ మూర్తి మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను అడ్డుకు నేందుకు భారత దేశంలోని యావత్ కార్మికవర్గం మే 20వ తేదిన సమ్మె చేయడం ద్వారా అడ్డు కోవాలని పిలుపునిచ్చారు. 13 కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఈ సార్వత్రిక సమ్మె కు అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనం ధరలకు అనుగుణంగా 26 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తుందని తెలిపారు. కార్మిక చట్టాలు బలంగా ఉన్నప్పుడు కూడా కార్మికులకు అరకొరగా మాత్రమే అమలు జరిగేవని, ఇప్పుడు 44 కార్మిక చట్టాలను రద్దు చేసిన తర్వాత భారతీయ కార్మికులు బానిసల కంటే దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టబడతారని హెచ్చరించారు. హైర్ అండ్ ఫైర్, ఫిక్సిడ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, ఆప్రెంటీస్ విధానాల ద్వారా కార్మికుల శ్రమను కార్పొరేట్ యాజమాన్యాలకు దోచి పెట్టేందుకే మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లు తీసుకువచ్చిందని ఆరోపించారు. చట్టాన్ని ఉల్లంఘించే యాజ మాన్యాలపై విధించే శిక్షలను తొలగించి, రాజ్యాంగబద్ధంగా పోరాడే కార్మికులపై క్రిమినల్ చర్యలు తీసుకునేలా చట్టాలను మార్పులు చేయడాన్నీ కార్పొరేట్ పెట్టుబడిదారుల లాభల కోసమేనని విమర్శించారు. పెట్టుబడిదారి ఆర్థిక సంక్షోభాన్ని సామాన్య ప్రజలపై, కార్మికులపై బలవంతంగా రుద్దేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మే 20 సమ్మెలో కార్మికులు సంఘాలతో నిమిత్తం లేకుండా భారీగా పాల్గొనడం ద్వారా తిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు. నెలవారీ కనీస వేతనం రూ. 26,000, ఉద్యోగుల పెన్షన్ పథకం కింద నెలవారీ పెన్షన్ రూ. 9,000 అందించడం సహా పలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు
సూర్యనారాయణ, జ్యోతి లక్ష్మి, రాజేశ్వరి, సహెదా, రేణుక, గంగులమ్మ, అలివేలు పాల్గొన్నారు.