వీరబల్లి : అన్నమయ్య జిల్లా వీరబల్లి ఫారెస్టు బీటు పరిధిలో ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేయడంతో పాటు, వారి నుంచి 9ఎర్రచందనం దుంగలను ఎర్రచందనం టాస్క్ ఫోర్సు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్సు ఎస్పీ శ్రీనివాస్ అధ్వర్యంలో డీఎస్పీ బాలిరెడ్డి మార్గనిర్దేశకంలో ఆర్ఐ (ఆపరేషన్స్) కే.సురేష్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఐ కేఎస్కే లింగాధర్ టీమ్ స్థానిక ఎఫ్బీఒ జి అనిల్ కుమార్ తో కలసి, సోమవారం నుంచి అన్నమయ్య జిల్లా వీరబల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. వీరు ఆ ప్రాంతంలోని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను తనిఖీ చేసుకుంటూ వెళుతూ మంగళవారం ఉదయం వీరబల్లి మండలం జరికోన వద్దకు చేరుకున్నారు. అక్కడ కొంత మంది వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకుని వెళుతూ కనిపించారు. వారిని హెచ్చరించినా ఖాతరు చేయకపోవడంతో వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. వారిలో కొందరు పారిపోగా వెంబడించి ఆరుగురిని పట్టుకోగలిగారు. ఆ ప్రాంతంలో వెతుకగా 9ఎర్రచందనం దుంగలు లభించాయి. పట్టుబడిన వారిని తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. వారిని అరెస్టు చేసి, దుంగలతో సహా తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తరలించారు. పారి పోయిన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసును నమోదు చేసుకున్న ఎస్ఐ ఎండీ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమావేశంలో డీఎస్పీలు వీ శ్రీనివాస రెడ్డి, ఎండీ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
